విశాఖపట్నంలో కొమ్మాది స్వయంకృషినగర్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ఓ యువతి ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి లక్ష్మి (43) మృతి చెందగా కుమార్తె దీపిక (20)కు తీవ్ర గాయాలయ్యాయి.యువతి తల్లి రక్తపు మడుగులో విగతజీవిగా పడిపోయింది. ఇక ఆ యువతి కూడా రక్తపు మడుగులోని కొన ఊపిరితో కొట్టుకుంటుండగా స్థానికులు గమనించి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. మరోవైపు తల్లీ కుమార్తెలపై కత్తితో దాడి చేసిన తర్వాత ఆ ప్రేమోన్మాది అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పీఎం పాలెం పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కిరాతకంగా
బాధితురాలు దీపిక ఇంట్లో కి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఓ యువకుడు చొరబడ్డాడు. అనంతరం దీపిక, ఆమె తల్లిపై అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో దీపిక తల్లి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్న దీపికను నవీన్ అనే వ్యక్తి ప్రేమించాడని అతడే ఈ దాడి చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిందితుడు
పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంతకీ ఆ నిందితుడు ఎవరు ఎందుకు గొడవ వచ్చింది,అనే విషయాలు వెల్లడి కాలేదు. విశాఖలో గతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన ఇంకా మరువకముందే తాజాగా కొమ్మాది స్వయంకృషినగర్‌లో జరిగిన మరో సంఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.

ఇటీవల కాలంలో
ఇటీవల కాలంలో ప్రేమోన్మాదుల దాడులు పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.ప్రేమకు నిరాకరించారని యువతులపై యువకులు దాడులు చేస్తున్న ఘటనలు దేశంలోని పలు రాష్ట్రాల్లో రోజూ ఏదో ఒక చోట చోటు చేసుకుంటున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహ ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయి.
హోంమంత్రి అనిత స్పందన
ఈ దారుణ ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చితో ఫోన్‌లో మాట్లాడి, బాధితురాలు దీపిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.నిందితుడిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని సూచించారు.యువతి తల్లి లక్ష్మి మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.