సందీప్‌ ఘోష్‌పై మరిన్ని విషయాలు వెలుగులోకి..!

More things come to light on Sandip Ghosh..!

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ను ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సందీప్‌ ఘోష్‌ గురించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక పురుష నర్సింగ్‌ విద్యార్థిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.

పలు మీడియా కథనాల ప్రకారం.. 2017లో ముర్షిదాబాద్‌ మెడికల్ కళాశాలలో ఆర్థోపెడిక్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ ఫిజీషియన్‌గా సందీప్‌ ఘోష్‌ పనిచేశారు. ఈ క్రమంలో హాంకాంగ్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌ (యౌ మా టీ) హాస్పిటల్‌లో నిర్వహించిన అటాచ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో హాంకాంగ్‌కు చెందిన ఓ పురుష నర్సింగ్‌ విద్యార్థిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదయ్యింది. ఈ కేసుపై హాంకాంగ్‌ కోర్టులో విచారణను సైతం ఎదుర్కొన్నారు. అయితే ఆ కేసులో ఘోష్‌ నిర్దోషిగా విడుదలయినట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థిపై హత్యాచారం ఘటన పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్న కాలేజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్‌ను ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సీబీఐ అరెస్టు చేసింది.