ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం పొందడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘జనశక్తి ప్రధానం. అభివృద్ధి, సుపరిపాలనను గెలిపించారు. ఈ చరిత్రాత్మక విజయాన్ని అందించిన ఢిల్లీలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు సెల్యూట్. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, వికసిత్ భారత్ ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించే విధంగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. ఈ చరిత్రాత్మక విజయాన్ని ఢిల్లీలోని ప్రజలికి మోడీ అంకితమిచ్చారు. ఈ విజయం ప్రజల ఆకాంక్షల ప్రతిబింబంగా, ప్రజల బలం అభివృద్ధి కోసం కొనసాగించిన ప్రగతిని తెలిపే సంకేతంగా ఆయన చాటారు.

అలాగే ప్రధాని మోదీ మరో కీలకమైన అంశం ఎత్తిచూపారు. ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం కొత్త ప్రణాళికలు రూపొందించడం, ప్రజల అవసరాలను తీర్చడానికి అవసరమైన మార్గాలను ఆవిష్కరించేందుకు బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చాడు. ఇక మునుపటి కంటే.. ఈ సారి ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి. గెలుపు కోసం ఆప్, బీజేపీ గట్టిగా తలపడ్డాయి. ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో..బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఢిల్లీని చుట్టేశారు. మరోవైపు ఆప్ నుంచి కూడా కేజ్రీవాల్ తన శక్తినంతా ఒడ్డి..గెలుపు కోసం ప్రయత్నించారు. చివరి వరకు గట్టి పోటీయే ఇచ్చిన ఆప్.. చెప్పుకోదగ్గ సీట్లు సాధించి ప్రతిపక్షానికి పరిమితమైంది. తమకు డబల్ ఇంజిన్ సర్కారే కావాలంటూ.. ఢిల్లీ ప్రజలు కమలానికే అధికార పీఠం కట్ట పెట్టారు. దీంతో 27 ఏళ్ల తర్వాత.. ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది.