స్పీకర్‌ ఎన్నిక వేళ లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం

లోక్‌సభ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాని మోడీ , లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌ గాంధీ ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. దేశ చరిత్రలో తొలిసారి లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఇవాళ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. సభ ప్రారంభం కాగానే ఎన్డీయే కూటమి తరఫున లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా మంత్రులు, ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. ఇక ఇండియా కూటమి తరఫున కె.సురేశ్‌ పేరును శివసేన (యుబిటి) ఎంపీ అరవింద్‌ సావంత్‌ తీర్మానం చేశారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం స్పీకర్‌ పదవికి ఎన్నిక చేపట్టారు. మూజువాణీ ఓటుతో చేపట్టిన ఈ ఎన్నిక ప్రక్రియలో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్‌ బర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు.

ఈ ప్రకటన అనంతరం 18వ లోక్‌స‌భ స్పీకర్‌గా ఎన్నికైన‌ ఓం బిర్లాకు స్వాగతం పలికేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి ప్రధాని మోడీ ట్రెజరీ బెంచీల ముందు వరుసలో ఉన్న బిర్లా సీటు వద్దకు వెళ్లారు. ఇక అప్పుడే రాహుల్‌ కూడా అక్కడికి వచ్చి నూతన స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ వెంటనే పక్కనే ఉన్న మోడీ కి షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. దీంతో ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు.