అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు మోదీ ప్రభుత్వం తలొగ్గింది! అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు విధించిన ఏప్రిల్ 2 గడువు సమీపిస్తుండడంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమెరికా దిగుమతులలో సగానికి పైగా వస్తువులపై సుంకాన్ని తగ్గించాలని యోచిస్తోంది. అమెరికా దిగుమతులలో సగం అంటే దాదాపు రూ.1.97 లక్షల కోట్ల (23 బిలియన్ డాలర్లు) విలువైన దిగుమతి సుంకాలపై కోత విధించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. అమెరికాకు జరిగే రూ.5.65 లక్షల డాలర్ల (66 బిలియన్ డాలర్లు) ఎగుమతులను రక్షించుకోవాలని ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది
అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాల హెచ్చరిక దాని మిత్రదేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా విధించనున్న ప్రతీకార సుంకాలు 87 శాతం భారతీయ ఎగుమతులపై ప్రభావితం చూపుతాయని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి 55 శాతం అమెరికా దిగుమతులపై సుంకం తగ్గించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం అమెరికా దిగుమతులపై భారత్ 5 శాతం నుంచి 30 శాతం వరకు సుంకాలు విధిస్తోంది. కొన్ని సుంకాలను తగ్గించి, మరి కొన్నిటిపై పూర్తిగా సుంకాలు తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై సుంకాలు తగ్గించే విషయం కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం నుంచి వాణిజ్య చర్చలు ప్రారంభం అవుతున్నాయి.
ఏ వస్తువులపై సుంకాల కోత?
అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులలో సగం వస్తువులపై సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఆల్మండ్లు, ఓట్‌మీల్, పిస్తాపప్పు, క్వినోవా ఉండనున్నాయి. అయితే మాంసం, మొక్కజొన్న, గోధుమలు, పాడి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించబోమని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది.