మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం – MLC కవిత

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరసన దీక్ష ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో కవిత దీక్ష చేస్తున్నారు.

ముందుగా స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసిన ఆమె… ఆ తర్వాత దీక్షా స్థలి దగ్గర కూర్చున్నారు. భారత జాగృతి సంస్థ ఈ దీక్షను నిర్వహిస్తోంది. దీనికి సీపీఐ , సీపీఎంతోపాటూ… ఎన్సీపీ , టీఎంసీ, సమాజ్‌ వాదీ పార్టీ, డీఎంకే , ఆప్ , నేషనల్‌ కాన్ఫరెన్స్, శివసేన , పీడీపీ, జేడీయూ, ఆర్జేడీ, అకాలీదళ్, ఆర్‌ఎల్డీ, జేఎమ్‌ఎమ్‌ సహా 18 పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ఈ నిరసన దీక్షలో దీక్షలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌ రెడ్డి, రేఖానాయక్‌తోపాటు భారత జాగృతి మహిళా నేతలు కూర్చుకున్నారు. సీపీఎం నేత సీతారాం ఏచూరీ దీక్షలో పాల్గొని సంగీభావం తెలిపారు.

జంతర్‌మంతర్‌లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. భారత సంస్కృతిలో మహిళకు పెద్దపీట వేశారన్నారు. అమ్మానాన్న అంటారు.. అందులో అమ్మ శబ్ధమే ముందు ఉంటుంది. రాజకీయాల్లోనూ మహిళకు సముచిత స్థానం దక్కాలని స్పష్టంచేశారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.