అమరావతి: టీడీపీ క్రమశిక్షణా కమిటీ ఎదుట ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈరోజు హాజరయ్యారు. ఈనెల 11న తిరువూరు నియోజకవర్గంలో ఎస్టీ కుటుంబంపై ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. గ్రామంలో రోడ్డు వివాదం విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. ఈ ఘటన నేపథ్యంలో కొలికపూడి పట్ల ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో ఈనెల 20న పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని పార్టీ అధిష్టానం కొలికపూడికి నోటీసులు ఇచ్చింది.

కొలికపూడి శ్రీనివాసరావు అధిష్టానం ఆదేశం మేరకు ఇవాళ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చారు. పార్టీ క్రమణ శిక్షణ కమిటీ సంఘం అధ్యక్షులుగా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ ఉన్నారు. వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, పంచుమర్తి అనురాధ, బీదా రవిచంద్ర సభ్యులుగా ఉన్నారు. ఇదిలాఉంటే.. కొలికపూడి వరుస వివాదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. దీంతో పార్టీ నాయకత్వం ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా, టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి శ్రీనివాసరావు హాజరుకానుండటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఓ వివాదం విషయంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. గతంలో ఆయన వైఖరిని నిరసిస్తూ తిరువూరు నియోజకవర్గ నేతలు కొందరు విజయవాడలో ధర్నాలుసైతం చేశారు. ఆ సమయంలో పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. గడిచిన ఏడు నెలల్లో రెండోసారి ఆయన తన వివాదాలపై పార్టీ కార్యాలయం మెట్లు ఎక్కబోతున్నారు. ఇవాళ కొలికపూడి శ్రీనివాసరావు ఇచ్చే వివరణను నివేదిక రూపంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ చంద్రబాబుకు అందజేయనుంది. చంద్రబాబు, పార్టీ పెద్దలు కొలికపూడిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతుంది.