అపూర్వ స్పందన పొందిన ‘మిషన్ బ్రెయిన్ అటాక్’

‘Mission Brain Attack’ received unprecedented response

హైదరాబాద్: జాతీయ ప్రచార కార్యక్రమమైన ‘మిషన్ బ్రెయిన్ అటాక్’ కు హైదరాబాద్ లో అపూర్వ స్పందన లభించింది. ఈ ప్రచార కార్యక్రమం ప్రధానంగా స్ట్రోక్స్ కు సంబంధించి ఎండ్ టు ఎండ్ సంరక్షణపై దృష్టి పెట్టింది. ఇటీవలే వారణాసిలో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ (ఐఎస్ఏ)చే ప్రారంభించబడింది. స్ట్రోక్ రాకుండా జాగ్రత్తపడడం మొదలుకొని అక్యూట్ మేనేజ్ మెంట్, రిహాబిలిటేషన్ అంశాలపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి పెడుతుంది. ప్రతీ నలుగురిలో ఒకరు స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉందని అంతర్జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఐఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ నిర్మల్ సూర్య మాట్లాడుతూ, ‘‘స్ట్రోక్ వచ్చేందుకు మూడు ప్రధాన కారణాలున్నాయి. అవి – బ్లడ్ ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్. మీ ఇంట్లో పెద్ద వారిలో ఎవరికైనా స్ట్రోక్ వచ్చిఉంటే, మీకు గనుక బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉంటే, మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీరు తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలి, కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవాలి, ఆల్కహాల్, పొగాకు తీసుకోవడం మానేయాలి’’ అని అన్నారు. ‘‘సగటున ప్రతీ నిమిషానికి ముగ్గురు వ్యక్తులు పెరాలిసిస్ తో బాధపడుతున్నట్లుగా ప్రస్తుత గణాంకాలు వెల్ల డిస్తున్నాయి. పెరాలిసిస్ అనేది మరణానికి మూడో అతిపెద్ద కారణం కూడా’’ అని ఆయన అన్నారు.

ఐఎస్ఏ కార్యదర్శి డాక్టర్ అరవింద్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మిషన్ బ్రెయిన్ అటాక్ అనేది ఈ తరహాలో నిర్వహించబడుతున్న ఏకైక జాతీయ ప్రచార కార్యక్రమం. స్ట్రోక్ నివారణ మొదలుకొని అవగాహన, నిర్వహణ, సంరక్షణ, పునరావాసం దాకా అన్ని అంశాల గురించి ఇది చర్చిస్తుంది. హైదరాబాద్ నగరం ఈ ప్రచార కార్యక్రమం పట్ల ఎంతో ఉత్సాహంతో, ఆసక్తితో చక్కగా స్పందించింది’’ అని అన్నారు. మీడియా సమావేశం సందర్భంగానే ఐఎస్ఏ ప్రతిష్టాత్మక కార్యక్రమం స్ట్రోక్ సమ్మర్ స్కూల్ కూడా జరిగింది. ఈ సందర్భంగా ఐఎస్ఏ ప్రెసిడెంట్ ఎలక్ట్, ఐఎస్ఏ స్ట్రోక్ సమ్మర్ స్కూల 2024 కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ పి. విజయ మాట్లాడుతూ, ‘‘ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ మార్గదర్శకత్వంలో మేం స్ట్రోక్ సమ్మర్ స్కూల్ పదో ఎడిషన్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తున్నాం. ఈ ప్రతిష్టాత్మక శిక్షణ కార్యక్రమం, ఐఎస్ఏ ఫ్లాగ్ షిప్ కార్యక్రమం ప్రధానంగా స్ట్రోక్ మెడిసిన్ విభాగంలోకి డీఎం, డీఎన్బీ న్యూరాలజీ ట్రైనీలను చేర్చుకునేందుకు నిర్వహించబడుతోంది. స్ట్రోక్ లేదా బ్రెయిన్ అటాక్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా వైకల్యానికి ప్రధాన కారణంగా ఉంటోంది. భారతదేశంలో ప్రతీ 30 సెకన్లకు ఒక వ్యక్తి స్ట్రోక్ బారిన పడుతున్నా రు. స్ట్రోక్ కారణంగా ప్రతీ మూడు నిమిషాలకు ఒక మరణం చోటు చేసుకుంటోంది. గత కొన్ని దశాబ్దాలుగా స్ట్రోక్ రోగులకు సంబంధించి రోగ నిర్ధారణ, చికిత్స, అదే విధంగా పునరావాసంలలో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయి’’ అని అన్నారు.

‘మిషన్ బ్రెయిన్ స్ట్రోక్’ లక్ష్యం బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన పెంపొందించడం మరియు మూడు రకాలుగా ఎండ్ టు ఎండ్ సంరక్షణ అందించడం. వీటిలో మొదటిది ముప్పు కారకాలను నియంత్రించే ప్రాథమిక నివారణ. రెండోది గోల్డెన్ అవర్ లో థ్రోంబోలిసిస్, మెకానికల్ థ్రోంబెక్టొమీ తో సహా కచ్చితమైన చికిత్స. ఇక మూడోది వైకల్యానికి గురైన వారికి దీర్ఘకాలిక రిహాబిలిటేషన్ కల్పించడం. స్ట్రోక్ సమ్మర్ స్కూల్ 2024 కు చక్కటి స్పందన లభించింది. అవగాహనను పెంచేదిగా, ఆలోచనలు రేకెత్తించేదిగా ఇది సాగింది. దేశవ్యాప్తంగా 34 నగరాల నుంచి ఎంపికైన సుమారు వంద మంది విద్యార్థులు దీనిలో పాల్గొన్నారు. వర్క్ షాప్స్, లెక్చర్స్, కేస్ ఆధారిత చర్చల ద్వారా నేర్చుకోవడంపై వారు ప్రధానంగా దృష్టి పెట్టారు. ప్రాథమిక అంశాలు మొదలుకొని ఇటీవలి ట్రయల్స్ దాకా ఎన్నో అంశాలు ఇందులో ఉన్నా యి. స్ట్రోక్ న్యూరాలజీ విభాగానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ నిపుణులు వివిధ అంశాల గురించి చర్చిం చారు. స్ట్రోక్ సమ్మర్ స్కూల్ 2024 ఎడిషన్ లో భాగంగా ఇందులో పాల్గొన్న వారికి క్విజ్ పోటీ, పోస్టర్ పోటీ కూడా నిర్వహించారు. ‘వరల్డ్ స్ట్రోక్ డే’ అనేది పోస్టర్ పోటీ థీమ్ గా ఉంది.

గోల్డెన్ అవర్ కు సంబంధించిన ముఖ్యాంశాలు:
గోల్డెన్ అవర్
నాలుగు గంటల 30 నిమిషాలు. ఈ సమయంలో రోగిని హాస్పిటల్ కు తీసుకువెళ్లి స్ట్రోక్ ను రివర్స్ చేయవచ్చు.
జెనెటిక్స్
స్ట్రోక్ రావడానికి జన్యుపరమైన ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ, వైద్య స్థితిగతులకు సంబంధించి కుటుంబ చరిత్ర కూడా గణనీయ పాత్ర పోషిస్తుంది.
సంకేతాలు:
స్ట్రోక్ కు సంబంధించిన వివిధ రకాల సంకేతాలను గుర్తించడం, స్ట్రోక్ కు గురైన వ్యక్తిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లడం, ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచడం ముఖ్యం.
కొన్ని సంకేతాలు:

B – బ్యాలెన్స్
E – విజన్ లాస్
F – ఫేషియల్ డీవియేషన్
A – ఆర్మ్ అండ్ లెగ్ వీక్ నెస్
S – స్పీచ్ డిస్టర్బెన్స్
T – స్ట్రోక్ రెడీ హాస్పిటల్ (సీటీ స్కాన్ లభ్యత ఉండేది) కు వెళ్లేందుకు 108 లేదా అంబులెన్స్ ను కాల్ చేసే సమయం