- కులం, మతం చూడకుండా ప్రజలను ఐక్యంగా చూడటమే కాంగ్రెస్ విధానం
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “రాహుల్ గాంధీ ఏ కులం? ఏ మతం?” అంటూ ప్రశ్నించిన బీజేపీ నేతలకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. కులం, మతం చూడకుండా ప్రజలను ఐక్యంగా చూడటమే కాంగ్రెస్ విధానం అని మంత్రి స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు.

బీజేపీ బీసీ వర్గాలను మోసం చేస్తోందని శ్రీధర్ బాబు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టకుండా బీజేపీ బీసీలకు అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. హిందువుల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా బీజేపీకి లేదని ఆయన అన్నారు.
ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులం గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు రాహుల్ గాంధీ కులం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా శ్రీధర్ బాబు పైవిధంగా స్పందించారు. రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని, అతని నాయకత్వాన్ని కులంతో అంచనా వేయడం అప్రాసంగికం అని ఆయన అన్నారు.