10 గంటలపాటు తన శాఖల పనితీరు ఫై సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే పవన్ కళ్యాణ్ తన శాఖల అధికారులతో ఏకంగా 10 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఉదయం విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు పవన్. తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగానూ పవన్‌ బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత తన శాఖల అధికారులతో సమావేశమయ్యారు.

గ్రామాల్లోని రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, మంచినీటి కొరత రాకుండా చూడటంపై అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. తాను చెప్పిన అంశాలపై వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల్లో ఈ సమస్యల పరిష్కారం జరగాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దన్నారు.

ఆ తర్వాత జనసేనానితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సమావేశమయ్యారు. ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ పవన్ కల్యాణ్ సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం దస్త్రంపై రెండో సంతకం చేశారు.