పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కందుల దుర్గేష్ గురువారం సాయంత్రం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. రూ.2.31 కోట్లతో 10 టూరిజం బోట్ల కొనుగోలుకి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, టీడీపీ నేతలు హాజరై మంత్రికి అభినందలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతంతో, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక పరంగా ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. పర్యాటకం మరియు కళల పట్ల ప్రత్యేక శ్రద్ద ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో, పర్యావరణ హితమైన పర్యాటకాన్ని అభివృద్ది పర్చాలనే ఆలోచన ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాబోయే ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్బుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దుతామన్నారు.

రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ఎన్నో అందమైన లొకేషన్లు, ప్రాంతాలు ఉన్నాయని, సినీ రంగ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన స్టూడియోల నిర్మాణానికి రాష్ట్రం ఎంతో అనువుగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి, మౌలిక వసతుల మెరుగుదలకు సినీరంగ ప్రముఖులు, నిర్మాతలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన ఆహ్వానించారు.