ఎట్టి పరిస్థితుల్లో జీవో నంబర్ 1ను వెనక్కి తీసుకోం – అంబటి

Minister Ambati Rambabu Fires on Chandrababu

ఏపీలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నంబర్ 1 ఫై ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జీవో నంబర్ 1 అంటూ కొత్త జీవో తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీలను జనాల్లోకి వెళ్లకుండా చేస్తుందని , ర్యాలీ , సభలు జరపకుండా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి సభలకు , ర్యాలీలకు అనుమతి లేదంటూ, అధికార పార్టీ మాత్రం స్వేచ్ఛగా ర్యాలీ లు , సమావేశాలు , సభలు జరుపుతుందని , అధికార పార్టీ కి ఓ రూల్ , ప్రతిపక్ష పార్టీ కి ఓ రూలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే జీవో నంబర్ 1 ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో జీవో నంబర్ 1ను వెనక్కి తీసుకునేది లేదని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేసారు.

23 సీట్లు సాధించిన వ్యక్తి 5 కోట్ల మంది ప్రజల తరఫున కుప్పం వెళ్లి ఎలా మాట్లాడతాడు? అని నిలదీశారు. చంద్రబాబు కుప్పంలో జీవో 1ను పాటించటాన్ని తిరస్కరించారని.. చట్టాన్ని ఉల్లంఘించమని చెబుతున్నాడని అంబటి రాంబాబు మండిపడ్డారు. జీవో 1 ప్రకారం రోడ్ల మీద బహిరంగ సభలు పెట్టకూడదని…నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే సభలు నిర్వహించాలని పేర్కొన్నారు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉండదా?? అని ఆగ్రహించారు.

చంద్రబాబు తిరిగితే ఏమవుతుంది..? ఏమయ్యింది? అని ప్రశ్నించారు. తిరిగిన తర్వాతేగా 23 స్థానాలకు పరిమితం అయ్యిందని.. కుప్పంలో జెడ్పీటీసీలు, ఎమ్పీటీసీలు గెలిచావా? అని ప్రశ్నించారు. నా కుప్పం…నా కుప్పం అంటూ చంద్రబాబు రంకెలు వేస్తున్నాడని.. ఆ కుప్పంలో ఇల్లు కాదు కదా ఓటు కూడా చంద్రబాబుకు ఎందుకు లేదు? అని మంత్రి అంబటి నిలదీశారు.