మైక్రో ఫైనాన్స్ ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. వరంగల్, కరీంనగర్, విశాఖ వంటి పలు జిల్లాల్లో రుణ సంస్థల బాధలు భరించలేక కొందరు ఇప్పటికే మృత్యు వాత పడ్డారు. కరీంనగర్లో డబ్బు చెల్లించని ఓ మహిళను లాక్కెళ్లిన ఘటన, విశాఖలో తల్లిదండ్రులు తీసుకున్న డబ్బుల కోసం చిన్నారిని కిడ్నాప్ చేయటం వంటి అమానుష ఘటనలు వెలుగులోకి వహ్చాయి. తాజాగా మరో దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల లో చోటుచేసుకుంది.
తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో కొంతకాలంగా మహిళలు మైక్రో ఫైనాన్సు సంబంధించిన కొన్ని ప్రైవేటు ఫైనాన్స్ ద్వారా అప్పులు తీసుకున్నారు. 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి చొప్పున తీరుస్తున్నారు. మంగళవారం రోజు కూడా ఆ మహిళల వాయిదా ఉండడంతో ఉదయం ఏడు గంటలకు మహిళ సంఘం లీడర్ ఇంటికి మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వచ్చారు. ఫ్యూజన్ ఫైనాన్స్ సిబ్బంది మహిళలు కట్టాల్సిన కిస్తీలను ఖచ్చితంగా చెల్లించాల్సిందే అని ఇంట్లో తిష్ట వేశారు. పండగ పూట డబ్బులు లేవని, పనులు లేక కుటుంబం గడవడమే కష్టంగా ఉందని ఇప్పుడు కట్టలేమని వచ్చే వాయిదలో చెల్లిస్తామని చెప్పినా ఇంట్లోనే కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వాల్టి వాయిదా చెల్లించాల్సిందేనని ఫైనాన్స్ సిబ్బంది తెగేసి చెప్పారు. ఉదయం 7 సెంటల నుండి దాదాపు సాయంత్రం నాలుగు గంటల వరకు మహిళలను మానసికంగా వేధింపులకు గురి చేశారు.
సమాచారం తెలుసుకున్న ఎల్డీఎం మల్లికార్జున్ అధికారి అక్కడికి చేరుకొని మహిళలతో ఫైనాన్స్ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఏ రూల్ ప్రకారంగా మీరు మహిళలకు రుణాలు ఇచ్చారని ఫైనాన్స్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఎవరైతే అప్పులు తీసుకుంటారో వారి ఇంటి వద్ద తిష్ట వేసుకొని కూర్చునే రూల్స్ మీకు లేదని, దాన్ని అతిక్రమిస్తే మాత్రం మీపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం తో వారు అక్కడినుండి వెళ్లిపోయారు.