మూడు రోజులుగా మీ సేవ కేంద్రాల్లో నిలిచిపోయిన సేవలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో మూడు రోజులుగా పౌర సేవలు నిలిచిపోయాయి. పోర్టల్ పనిచేయకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం మొదలుకొని స్కాలర్​షిప్ వరకు ఇలా ప్రతి అవసరానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవ కేంద్రానికి వెళ్లక తప్పదు. మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తరువాతే సంబంధిత కార్యాలయాల నుంచి ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతాయి. ఈ సర్టిఫికెట్లు కూడా మీ సేవ కార్యాలయాల నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ దాదాపు మూడు రోజులుగా నిలిచిపోయింది. దీంతో ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు చెప్పులరిగేలా ఈ సేవల చుట్టూ తిరుగుతున్నారు.

కొన్ని కేంద్రాలను నిర్వాహకులు మూసి వేసేశారు. ఓ వైపున కొన్ని స్కాలర్​షిప్ దరఖాస్తులకు చివరి తేదీ ముగుస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ సంబంధిత రికార్డులు, ఇతరాత్ర అవసరాల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు రెవెన్యూ కార్యాలయాల నుంచి తీసుకోవాల్సిన ధ్రువీకరణ పత్రాలు కూడా తీసుకునే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు ఉదయం, సాయంత్రం మీ సేవల చుట్టూ తిరగడమే సరిపోతుందని, దయచేసి సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయో చెప్పాలని బాధితులు వేడుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే సమస్య ఎదురుకావడంతో మీ సేవ కేంద్రాలు అన్ని కూడా సేవలందించలేకపోతున్నాయి. ప్రధాన సర్వర్లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో సేవలు నిలిచిపోయాయని, మరో రెండు రోజుల్లో పునరుద్ధరించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.