ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ దొంగతనం చోటుచేసుకుంది. పూర్తీ వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగర శివారులో దొంగలు బీభత్సం సృష్టించారు. శివారెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో కూతురు పెళ్లి కోసం ఉంచిన నగదు, రూ.కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లారు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం నగర శివారులోని బెంగుళూరు – హైదరాబాద్ హైవే సమీపంలో సవేరా ఆస్పత్రి వెనుక వైపు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి రాజహంస విల్లాస్‌లో బుధవారం భారీ చోరీ జరిగింది. దుండగులు బీరువాలో దాచి ఉంచిన రూ.20 లక్షల నగదుతో పాటు ప్రత్యేక లాకర్‌లో ఉంచిన రూ.3.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.

ఫిబ్రవరిలో కుమార్తె పెళ్లి ఉండడంతో బంగారం, డబ్బు అంతా ఇంట్లోనే ఉంచుకున్నట్లు వ్యాపారి దంపతులు తెలిపారు. పెళ్లి కార్డులు బంధువులకు ఇవ్వడానికి వెళ్లినప్పుడు దొంగతనం జరిగినట్లు చెప్పారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.