ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఫిబ్రవరి 1 నుండి పెంచనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. గ్రోత్ కారిడార్లు, భూముల విలువ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 0-20 శాతం వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని వెల్లడించారు. అయితే, అమరావతి పరిసర గ్రామాలకు ఈ పెంపు వర్తించబోదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన రెవెన్యూ పెంపుదల కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో భూముల విలువ ఆధారంగా ఛార్జీల పెంపుపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని తెలిపారు.
