ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. భద్రతా బలగాలు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి.

డీఆర్‌జీ (డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్), ఎస్టీఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) బృందాలు ఈ ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర పోషించాయి. ఎదురుకాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో, మరింత మంది మావోయిస్టులు హతమైన అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. గాయపడిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
దేశాన్ని నక్సల్స్ ప్రభావం నుంచి పూర్తిగా విముక్తం చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన తర్వాత, భద్రతా బలగాలు తమ దాడులను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా బీజాపూర్, నారాయణ్‌పూర్, బస్తర్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాల కదలికలు పెరిగాయి. దీనివల్ల భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య తరచూ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
ఇటీవల ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన మరో భారీ ఎన్‌కౌంటర్‌లో 20 మందికిపైగా మావోయిస్టులు మరణించడంతో పాటు ఓ అగ్రనేత కూడా హతమైనట్లు సమాచారం. వరుసగా జరుగుతున్న ఆపరేషన్లు మావోయిస్టుల శక్తిని దెబ్బతీసేలా మారాయి. భద్రతా బలగాల వ్యూహాత్మక దాడులతో నక్సల్స్ బలహీనపడుతున్నారు. ఈ తరహా ఆపరేషన్లు భవిష్యత్తులో మరింత ఉద్ధృతం కానున్నాయి. మావోయిస్టుల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు పెంచుతున్నాయి. నక్సల్స్ ఉనికి క్రమంగా తగ్గిపోతున్నప్పటికీ, పూర్తి నిర్మూలన కోసం మరింత కాలం కృషి అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు.