భారీ భూకంపం..రెండు ముక్కలైన ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే

massive-earthquake-in-turkey-splits-airport-runway-into-two

అంకారాః తుర్కియే, సిరియాలో సంభ‌వించిన మూడు శ‌క్తివంత‌మైన భూకంపాలు విల‌యం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. వరుసగా సంభవించిన మూడు శక్తివంతమైన భూప్రకంపనల కారణంగా అక్కడ వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భూకంప తీవ్రతకు తుర్కియే, సిరియాలోని సుమారు కొన్ని వేల బిల్డింగ్‌లు నేలమట్టమయ్యాయి.

తుర్కియేలోని హతయ్‌ ప్రావిన్స్‌లో గల ఎయిర్‌పోర్టు రన్‌వే భూకంపం ధాటికి పూర్తిగా ధ్వంసమైంది. రన్‌వేపై పగుళ్లు ఏర్పడి రెండు ముక్కలై ఎందుకూ పనికి రాకుండా పోయింది. దీంతో ఈ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కాగా, తుర్కియే భూకంపంలో మృతుల సంఖ్య 4,372కు చేరుకున్నట్లు తెలుస్తోంది. కేవ‌లం తుర్కియేలోనే 2921 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆ దేశ డిజాస్టర్ సంస్థ తెలిపింది. ఇక ఆ దేశంలో గాయ‌ప‌డ్డవారి సంఖ్య 15,834గా ఉన్నట్లు పేర్కొన్నది. సిరియాలో భూకంపం వ‌ల్ల సుమారు 1451 మంది మ‌ర‌ణించారు. మ‌రో 3531 మంది గాయ‌ప‌డ్డారు.

తుర్కియేలో ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాల‌ను ప్రక‌టించింది. వ‌రుస‌గా మూడు భారీ భూకంపాల‌తో ఆ దేశం అత‌లాకుత‌ల‌మైన‌ట్లు అధ్యక్షుడు రీసెప్ త‌య్యిప్ ఎర్డగోన్ తెలిపారు. తుర్కియేలో సుమారు 185 సార్లు భూ ప్రకంప‌న‌లు న‌మోదు అయిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఖ‌ర‌మ‌న్‌మార‌స్ కేంద్రంగా భూమి కంపించిన విష‌యం తెలిసిందే. రెండో కంపం 7.7 తీవ్రత‌తో, మూడ‌వ‌ది 7.6 తీవ్రత‌తో సంభ‌వించిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాజక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద అనేక మంది ప్రజలు చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.