గ్రేటర్ బీఆర్ఎస్ నేతల సమావేశానికి డుమ్మా కొట్టిన పలువురు ఎమ్మెల్యేలు

బిఆర్ఎస్ పార్టీ లో ఏంజరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన నేతలంతా..ఇప్పుడు అధికారం కోల్పోవడం తో పార్టీ మారుతూ వస్తున్నారు. మంత్రి పదవులు అనుభవించిన నేతలే కాదు కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు సైతం పార్టీని వీడుతూ వస్తున్నారు. అంతే కాదు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా నేతలు సైతం పలువురు కాంగ్రెస్ లో చేరారు. మరికొంతమంది కూడా పార్టీని వీడబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ తరుణంలో శుక్రవారం గ్రేటర్ బీఆర్ఎస్ నేతల సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో ఆ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. అసలు వీరు పార్టీలో ఉంటారా.. లేక వెళ్లిపోతారా? అనే చర్చ జరుగుతోంది. శనివారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ఒకరోజు ముందు ‘గ్రేటర్’ బీఆర్ఎస్ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే పార్టీ మారిన వారిని ఇరుకున పెట్టేలా వ్యూ హాన్ని రూపొందించేందుకు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో భేటీ అయి చర్చించాలని భావించారు.

అయితే, ఈ మీటింగుకు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, గూడెం మహిపాల్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి హాజరు కాలేదు. 47 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లలో 39 మంది మాత్రమే వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇందులో కొందరు అం దుబాటులో లేకపోవడం, వ్యక్తిగత కారణాలతో రాలేదని తెలిసింది. ఈ సమావేశానికి కేటీఆర్ నేతృత్వం వహిస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే, కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్ విషయంలో సీనియర్ అడ్వకేట్స్‌తో మంతనాలు జరిపేందుకు వెళ్లారు. దీంతో తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.