దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం హైదరాబాద్లో విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. రాష్ట్ర రాజధానిలోని ముఖ్యమైన జంక్షన్ వద్ద ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన విశేష సేవలను గౌరవించేందుకు తీసుకున్నదిగా తెలుస్తోంది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. మన్మోహన్ సింగ్ పేరిట ఓ పథకాన్ని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక రంగంలో ఆయన చూపిన నాయకత్వాన్ని గుర్తుచేసేలా ఆ పథకం రూపొందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, ఆర్థిక సహాయం, సంక్షేమ రంగాల్లో మన్మోహన్ పేరుతో పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. శాసనసభ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థంగా చేపట్టబోయే ఈ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక గుర్తింపును కల్పించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థను లిబరలైజేషన్ దిశగా నడిపించిన ప్రధాన కర్తవ్యం నిర్వహించారు. అతని పేరు మీద విగ్రహం ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు గర్వంగా భావిస్తున్నారు. ఈ విగ్రహం రాష్ట్ర ప్రజలకు ఆయన సేవలను గుర్తు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. విగ్రహం ఏర్పాటు, పథకానికి పేరుపెట్టడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వం ప్రజల్లో పాజిటివ్ అభిప్రాయాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ట్రై చేస్తుంది.