టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల కుటుంబ విభేదాలతో వార్తల్లో నిలిచిన మనోజ్, ఈరోజు రంగంపేటకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సందర్బంగా మనోజ్ జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ కార్యక్రమంలో అతని హాజరుతో మరిన్ని చర్చలు చోటుచేసుకుంటున్నాయి.
జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొనడం మాత్రమే కాదు, మనోజ్ తన తండ్రి పేరుతో స్థాపించిన మోహన్ బాబు యూనివర్సిటీకి కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ యూనివర్సిటీలో ఇప్పటికే మోహన్ బాబు, మంచు విష్ణు ఉన్నారు. ఈ సందర్శనతో కుటుంబంలో ఉన్న విభేదాలు పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారేమోననే చర్చలు సృష్టిస్తోంది. మనోజ్ రాక నేపథ్యంలో రంగంపేటలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. కుటుంబ సభ్యుల మధ్య గల విభేదాల కారణంగా గతంలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్ సందర్శన కుటుంబసమస్యల పరిష్కారానికి దారితీయగలదని అనుకుంటున్నారు.
ఇక మొన్నటి వరకు మంచు విష్ణు, మోహన్ బాబుతో మనోజ్‌కి ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ సమస్యలు కాస్త వ్యక్తిగతం నుంచి బహిరంగంగా మారాయి. కానీ ఇప్పుడు మనోజ్ యూనివర్సిటీకి వెళ్లడం వలన కుటుంబసభ్యుల మధ్య సమన్వయం కుదిరే అవకాశముందని అనేకమంది ఆశాభావంతో ఉన్నారు.
ఇంతలో మంచు మనోజ్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులు మరియు పరిశ్రమలోని పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. కుటుంబం మధ్య విభేదాల్ని పక్కన పెట్టి, ఒకతాటిపైకి రావడం మంచు కుటుంబానికి, వారి అభిమానులకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఈ పరిణామాలు ఎలా మారతాయన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది.