మమతా బెనర్జీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బెంగాల్‌, జార్ఖండ్‌ సరిహద్దులు మూసివేత

Mamata Banerjee government’s key decision.. Bengal and Jharkhand border closure

కోల్‌కతా : జార్ఖండ్‌కు నీరు వదిలే క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు జల్లాలను వరద నీరు ముంచెత్తడంతో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ) వ్యవహారించిన తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. జార్ఖండ్‌ను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఈ విధంగా వ్యవహరించడం వల్లే వరద నీరు రాష్ట్రానికి పోటెత్తిందన్నారు. అవసరమైతే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌తో తెగ తెంపులు చేసుకునేందుకు తాము సిద్దంగా సీఎం మమత స్పష్టం చేశారు.

జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సరిహద్దులను మూడు రోజుల పాటు మూసి వేస్తున్నట్లు ఈ సందర్బంగా ఆమె ప్రకటించారు. ఇది కేవలం మనవ తప్పదమని సీఎం మమత పేర్కొన్నారు. డీవీసీ.. డ్యామ్‌ల వద్ద పూడిక తీయడంలో దారుణంగా విఫలమయిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో వరద నీరు చుట్టు ముట్టిన హౌరా, మిడ్నాపూర్ జిల్లాల్లోని పలు వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమత పర్యటించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇదేమీ వర్షపు నీరు కాదన్నారు. డీవీసీ వదిలిన నీరు అని ఆమె వ్యంగ్యంగా అన్నారు. డీవీసీ వ్యవహార శైలి ఇదే విధంగా కొనసాగితే.. వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చేపడతామని సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. డీవీసీ డ్యామ్‌ల్లో నీటి స్టోరేజ్ కేపాసిటిపై ఈ సందర్భంగా ఆ సంస్థకు పలు ప్రశ్నలను సీఎం మమత సంధించారు.

ఈ తరహా ఘటనలు గతంలో చోటు చేసుకోలేదని సీఎం మమత గుర్తు చేశారు. డీవీసీ డ్యామ్‌ల నుంచి భారీగా నీరు వదల వద్దంటూ ఆ సంస్థ చైర్మన్‌కు తాను సూచనలు సైతం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ఈ ఏడాది 5.5 లక్షల క్యూసెక్ల నీటిని డీవీసీ విడుదల చేసిందన్నారు. అందుకే బెంగాల్‌లో వరద పరిస్థితి ఏర్పడిందని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.