న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. రెండున్నర దశాబ్దాలకు పైగా అధికారానికి దూరంగా ఉన్న కాషాయ పార్టీ.. ఆమ్‌ఆద్మీకి గట్టి పోటీ ఇచ్చింది. మరోసారి అధికారాన్ని కాపాడుకునేందుకు ఆప్ కూడా తీవ్రంగా శ్రమించింది. కాంగ్రెస్ ప్రభావం మాత్రం పెద్దగా కనిపించలేదు. మొత్తంగా ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలుండగా.. జేవీసీ పోల్ బీజేపీకి 39-45, ఆమ్ ఆద్మీ పార్టీకి 32-31, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. టైమ్స్ నౌ బీజేపీకి 39-45, ఆప్‌కి 22-31, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొంది. మ్యాట్రిక్స్ సంస్థ ఆప్‌కు 32-37, బీజేపీకి 35-40, కాంగ్రెస్‌కు 0-1 వస్తాయని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీ సర్వే ఆప్‌కు 25-28, బీజేపీకి 39,45, కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వస్తాయని చెప్పింది. పీపుల్స్ పల్స్ కాంగ్రెస్‌కు ఆప్‌కు 10-19, బీజేపీకి 51-60 వస్తాయని అంచనా వేసింది. పీపుల్స్ ఇన్‌సైట్ ఆప్‌కు 25-29, బీజేపీకి 40-44, కాంగ్రెస్‌కు 0- ఒక స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేశాయి.
కాగా, 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ సారి మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌కు చెందిన సందీప్ దీక్షిత్, బీజేపీకి చెందిన ప్రవేశ్ వర్మ సైతం ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు. ఢిల్లీ సీఎం అతిషి మర్లేనా కల్కాజీ స్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగారు. ఈ స్థానం నుంచి బీజేపీ నుంచి రమేశ్ బిధురి పోటీ చేస్తున్నారు.