తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud as the President of Telangana PCC

హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీకాలం గత జులై 7వ తేదీతో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడ్డారు. అధిష్ఠానం మహేశ్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది.

2023లో పీసీసీ ఎన్నిక‌ల క‌మిటీ స‌భ్యుడిగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు మ‌హేశ్ కుమార్ గౌడ్. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా కొన‌సాగుతున్నారు. ఇక పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి మ‌ధుయాష్కీ గౌడ్, జీవ‌న్ రెడ్డి, జ‌గ్గా రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, అద్దంకి ద‌యాక‌ర్ పోటీ ప‌డ్డారు. కానీ చివ‌ర‌కు రేవంత్‌కు అత్యంత స‌న్నిహితుడైన మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ పీఠం వ‌రించింది. పీసీసీ అధ్య‌క్షుడు ఎవ‌ర‌నే క‌స‌ర‌త్తు రెండు వారాల క్రిత‌మే పూర్త‌యిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా నేడు ప్ర‌క‌టించింది.

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్‌ జిల్లాలోని భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జ‌న్మించారు. గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశాడు.

మహేష్ కుమార్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసి ఓట‌మి చ‌విచూశారు. ఆ తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియమితుల‌య్యారు.