బీజేపీ నాయకురాలు, నటి మాధవి లత, టీడీపీ నేత మరియు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధవి లత మంగళవారం గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తన ఫిర్యాదును అందజేశారు. మాధవి లత ఆరోపణ ప్రకారం, ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను తీవ్ర భావోద్వేగానికి గురిచేయడంతో పాటు, తన కుటుంబ సభ్యులలో భయం మరియు బాధను కలిగించాయి. నటీమణులు, మహిళల గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత క్షమాపణ చెప్పడాన్ని ఆమె తప్పు పట్టారు.

డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తాడిపత్రిలోని జేసీ పార్కులో మహిళలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మాధవి లత ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, జేసీ పార్కులో సామాజిక వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని, మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వ్యాఖ్యలకు ప్రభాకర్ రెడ్డి ప్రతిస్పందిస్తూ ఆమెపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన తరువాత క్షమాపణలు చెప్పినా, ఈ వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ ఘటనలపై మాధవి లత ముందుగా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆమె మాట్లాడుతూ, ఇలాంటి వ్యవహారాల వాళ్ళ మహిళల భద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.