‘దామగుండం’ రక్షణ పోరాటానికి కేటీఆర్ మద్దతు

వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని అనంతగిరి కొండల మధ్య ఉన్న దామగుండం అటవీ భూములను వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ కోసం భారత నావికాదళానికి కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి నిరసనగా తెలంగాణలోని కొంతమంది ఎన్విరాన్మెంటల్ ఆక్షన్ కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే, వికారాబాద్ అడవుల్లో సహజ వనరులు కోల్పోవడం, ఆహ్లాదకర వాతావరణం కోల్పోవడం, వన్యప్రాణుల మనుగడకు ముప్పు కలగడం వంటి సమస్యలు ఎదురవ్వచ్చు అని అభిప్రాయపడుతున్నారు.

దామగుండం అడవిని కాపాడాలంటూ జర్నలిస్టు తులసి చందు చేస్తోన్న పోరాటానికి కేటీఆర్ మద్దతు తెలిపారు. ఆమెను అభినందిస్తూ, పోరాటానికి సహాయపడతామన్నారు. ‘12.5 లక్షల చెట్లను, మొత్తం జీవావరణ వ్యవస్థను కాపాడేందుకు 3 వేల ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించేందుకు 10 ఏళ్లుగా కేసీఆర్ నిరాకరించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గింది. మూసీ నది ఉద్భవించిన ఈ ప్రాంతం గొప్ప జీవవైవిధ్యానికి నిలయం’ అని ట్వీట్ చేశారు.

2010 నుండి ప్రతిపాదన దశలో ఉన్న నావికాదళ రాడార్ ప్రాజెక్టు 2024లో పురోగతి సాధించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా దాదాపు 2900 ఎకరాల అటవీ భూములను అధికారులు స్వాధీనం చేసుకోబోతున్నారు, దీనిలో సుమారు 12 లక్షల చెట్లను నరికివేయాల్సి వస్తుంది. వికారాబాద్ దామగుండం పరిసరాల్లోని 20 గ్రామాల్లో సుమారు 60,000 మంది ప్రజల జీవితం ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభావితమవుతుందని అంచనా వేస్తున్నారు. అడవిపై ఆధారపడిన కూలీలు, రైతులు, పశువులను పెంచే కుటుంబాల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతినవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.