అమరావతి: విశాఖ ఉక్కుకు కేంద్రప్రభుత్వం రూ.11,440 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈప్యాకేజీపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రానికి గర్వకారణమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ప్రధాని మోడీ ఆమోదించిన రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అందించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్లాంట్‌కు పెద్దపీట వేసిన ప్రధాని మోడీకి ఈ క్రెడిట్ దక్కాలి. కేంద్రానికి ధన్యవాదాలు’ అని తెలిపారు.

ఉక్కు రెక్కల ఆయుధాలతో ఏపీ సరికొత్త శిఖరాలకు ఎదుగుతుందని, లక్షల మంది జీవితాలను మార్చుతుందని అన్నారు. ఈ ప్లాంట్ వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పారు.
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ ప్రకటించిన ప్యాకేజీలో రివైవల్ ప్యాకేజీకి కింద రూ.10,300 కోట్లు కేటాయించారని, ఉక్కు పరిశ్రమ నష్టాలను అధికమించేందుకు ఈ ప్యాకేజీ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ఉక్కు పరిశ్రమ పూర్తిస్థాయిలో ఉత్పాదకతతో లాభాల బాటలో పయనించేందుకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. నవ్యాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ ప్యాకేజీ నిదర్శనమని రామ్మోహన్ వివరించారు.