అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అపరిశుభ్రత అంశంపై స్పందించిన నారా లోకేశ్

తణుకులోని అన్న క్యాంటీన్‌లో అపరిశుభ్రమైన నీటితో తినేసిన ప్లేట్లు కడుగుతున్నట్లు ఓ వీడియో నిన్నటి నుంచి వైరల్‌ అవుతోంది. స్థానిక సొసైటీ రోడ్డులోని అన్న క్యాంటీన్‌లో ఈ ఘటన జరిగిందని, ఈ నెల 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి తన సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీసినట్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ఇంత ఘోరంగా ఉంటుందా..? ఒకపై అన్న క్యాంటీన్‌లో భోజనం చేయకూడదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన ఫై మంత్రి నారా లోకేష్ స్పందించారు.

తణుకు అన్న క్యాంటీన్ లో ప్లేట్ల అంశంపై వైసీపీ పార్టీది విష ప్రచారం అన్నారు. చేతులు కడిగే సింక్ లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలేనని, సింక్ లో ఉన్న ప్లేట్లు తీస్తుంటే వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుచి, శుచి శుభ్రతకు అన్న క్యాంటీన్ లలో ఎంతో ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీశారు. అన్న క్యాంటీన్లపై జగన్ విషం చిమ్మటం కొనసాగిస్తూనే ఉన్నాడని లోకేశ్ ట్వీట్ లో పేర్కొన్నారు. తణుకు అన్న క్యాంటీన్ లో శుభ్రత పాటించడం లేదన్న ప్రచారంపై మంత్రి నారాయణ ఆరా తీశారు. హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు, అధికారులు నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్లేట్లను మురికినీటిలో కడుగుతున్నారనేది పూర్తిగా అవాస్తమని మంత్రికి అధికారులు తెలిపారు. ఎక్కువ మంది రావడంతో డస్ట్ బిన్ కు బదులుగా వాష్ బేసిన్ లో ప్లేట్లు పెట్టారని, వాటిని తీస్తుంటే కొందరు వీడియో తీశారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.