ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణంపై అనుమానాస్పద పరిస్థితులు నెలకొనడంతో, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు.రోడ్డు పక్కన చనిపోయి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.బుల్లెట్‌తో సహా ప్రవీణ్ రహదారి పై నుంచి కిందకు జారీపోయాడని ఈ క్రమంలో బుల్లెట్ ఆయనపై పడటంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కానీ ప్రవీణ్ మృతదేహాన్ని చూసిన వారు మాత్రం అతడిని ఎవరో చంపి పడేశారనిప్రవీణ్ ఒంటిపై గాయాలు ఉన్నాయని రాడ్డుతో కొట్టినట్టు కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రవీణ్ మృతి విషయం తెలిసిన వెంటనే క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు ఆందోళనకు దిగారు. ప్రవీణ్‌ను ఆయన ప్రత్యర్థులు ఎవరో చంపేశారంటూ రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద నిరసన చేపట్టారు.
లోకేశ్ ట్వీట్
ఈ ఘటనపై మంత్రి లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ,”పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. అయితే, వివిధ సంఘాలు పాస్టర్ గారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేయిస్తాం” అని ట్వీట్ చేశారు.
ప్రాథమిక దర్యాప్తు
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదమే కారణం అనే ప్రాథమిక నిర్ధారణ వెలువడింది. అయితే, పాస్టర్ ప్రవీణ్ అనుచరులు, కొన్ని క్రైస్తవ సంఘాలు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .కొన్ని సంస్థలు,ఈ ఘటనపై విచారణ జరిపించాలని, ఇది సాధారణ ప్రమాదం కాదని తమ అనుమానాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని డిమాండ్ పెరుగుతోంది.
కుటుంబం స్పందన
పాస్టర్ పగడాల ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. “ఆయనకు ఎలాంటి ప్రమాదం సంభవించదని, అనుకోని రీతిలో జరిగిన ఘటన కాబట్టి దీని వెనుక మరేదైనా కారణం ఉండొచ్చని” భావిస్తున్నారు.
విస్తృత చర్చ
పాస్టర్ ప్రవీణ్ మృతిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. కొందరు ఆయన మరణం వెనుక కుట్ర ఉందని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలు బయట పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రవీణ్ గారి కాల్ డేటా, చివరి కాంటాక్ట్స్ ఆధారంగా విచారణ జరపనున్నారు.