చివరి శ్రావణ శుక్రవారం.. ఆలయాల్లో రద్దీ

సంవత్సరంలో మహిళలకు ప్రత్యేకమైన, ప్రాముఖ్యమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ శుక్రవారం యొక్క విశిష్టతను ఇదివరకే చెప్పుకున్నాము. శ్రావణ మాసంతో పెళ్లిళ్లు, పండుగల సందడి మొదలవుతుంది. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతం శ్రావణమాసపు రెండవ శుక్రవారం జరుపుకోవడం శాస్త్రంగా ఎంతో కాలం జరుగుతూ వస్తున్నది. అయితే ఏదైనా కారణాల వల్ల వరలక్ష్మి వ్రతం కానీ, ప్రత్యేక పూజలు కానీ చేసుకోలేని వాళ్లకు ఆఖరి శుక్రవారం జరుపుకుంటారు.

ఈరోజు చివరి శ్రావణ శుక్రవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో రద్దీ నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ కనకదుర్గ, సింహాచలం అప్పన్న, బాసర సరస్వతీ, పిఠాపురం పురుహూతిక తదితర ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పర్వదినం కావడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.

చాలామంది చివరి వారం చేసుకునే వరలక్ష్మి వ్రతంలో కానీ ప్రత్యేక పూజలో కానీ ముత్తయిదువులను పిలిచి వాయనం, తాంబూలం ఇవ్వడం ఒక పద్ధతి మరియు వారి ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. అయితే పూజ చేసుకున్న వారి నుండి తాంబూలం తీసుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకు తొందరగా పెళ్లవుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. వరమహాలక్ష్మి వివిధ రూపాలలో కరుణిస్తుందని, అదే విధంగా పెళ్లికాని అమ్మాయిలకు అన్ని సమస్యలు తొలగిపోయి పెళ్లి జరిగేలా అనుకూలత ఇస్తుందని నమ్మకం. కొన్ని ప్రాంతాలలో ఆరోజు భక్తితో ఉపవాసం ఉండి, పూజ చేసుకుని ముత్తైదువుల నుండి తాంబూలం అందుకుంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు.