లఖింపుర్ ఖేరి కేసు.. ఆశిష్ మిశ్రాకు సుప్రీం బెయిల్‌

Lakhimpur Kheri case.. Supreme bail for Ashish Mishra

న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు .. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. 2021లో జరిగిన లఖింపుర్ ఖేరి కేసు లో ఆశిష్‌కు బెయిల్ జారీ చేశారు. ఆశిష్ మిశ్రా వాహనం దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆశిష్ మిశ్రా.. ఢిల్లీ లేదా లక్నోలోనే ఉండాలంటూ కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. గత ఏడాది జనవరి 25వ తేదీన.. సుప్రీంకోర్టు ఆశిష్ మిశ్రాకు మధ్యంతర బెయిల్ మంజూరీ చేసింది. లఖింపుర్ ఖేరి కేసులో విచారణ చేపడుతున్న ట్రయల్ కోర్టు వేగంగా వాదనలను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓ టైం షెడ్యూల్ ప్రకారం ఆ కేసును పూర్తి చేయాలని సుప్రీం సూచించింది.

జస్టిస్ సూర్య కాంత్‌, ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం .. బెయిల్ మంజూరీ చేసింది. ఈ కేసులో రైతులకు కూడా ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు 117 మంది సాక్ష్యుల్లో కేవలం ఏడు మందిని మాత్రమే విచారించారని, ఈ కేసును వేగవంతంగా విచారణ చేపట్టాలని కోర్టు తెలిపింది. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో ఓ వాహనం రైతుల మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆవేశంలో రైతులు కూడా అటాక్ చేశారు. ఆ దాడిలో వాహన డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ జరిగిన హింసలో ఓ జర్నలిస్టు కూడా ప్రాణాలు కోల్పోయాడు.