నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ దూరం.. కేటీఆర్ కామెంట్స్

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్ర‌త్యేక కేటాయింపులు లేకపోవడంతో నిరసనగా ఈనెల 27న ప్రధాని మోడీ అధ్యక్షతన జ‌రిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గతంలో ప్రధానితో సమావేశాలను సీఎం కేసీఆర్ బహిష్కరిస్తే, కేంద్రంతో బిఆర్ఎస్ కుమ్మక్కైందని కాంగ్రెస్ ఆరోపించిందని ..మరి ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశాన్ని రేవంత్ రెడ్డి బాయ్ కాట్ చేయడంపై కాంగ్రెస్ ఏం చెపుతుందంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ సమస్యలపై ప్రధాని (పెద్దన్న) ని కలిసి మాట్లాడాలని తమ్ముడు (రేవంత్) ఎందుకు అనుకోవట్లేదని ప్రశ్నించారు.

తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన న్యాయమైన సమస్యల కోసం గతంలో సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ ప్రధానితో సమావేశాలను బహిష్కరిస్తే, కాంగ్రెస్ తప్పుబట్టిందని గుర్తుచేశారు. గతంలో భేటీకి వెళ్లకున్నా బీఆర్ఎస్​, బీజేపీతో కలిశామని ఆరోపించారని ధ్వజమెత్తారు. సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉండటానికి ఆ రెండు పార్టీలు కుమ్మక్కు కావటమే కారణమంటూ విమర్శించారని పేర్కొన్నారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తే కాంగ్రెస్ ఏం సమాధానం చెబుతుందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. చోటా భాయ్ రేవంత్​రెడ్డి, ప్రధానమంత్రిని కలవాలని, రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ సమస్యల గురించి మాట్లాడాలని ఎందుకు అనుకోవడం లేదన్నారు.

గతంలో విభజన సమస్యల పరిష్కారంతో పాటు తెలంగాణ పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై ప్రధాని మోడీని నిలదీయాలంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ప్రధానిని నిలదీసేందుకు నీతిఆయోగ్ సమావేశం సరైన వేదిక అంటూ చెప్పారు. కాగా, ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్‌ రెడ్డి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పు పడుతున్నారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరై రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధాని మోడీని రేవంత్ నిలదీయాలని డిమాండ్ చేస్తున్నారు.