బల్లిపడిన టిఫిన్లు.. చిట్టెలుకలు తిరిగే చట్నీలు – కేటీఆర్

ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత ఆహారం వల్ల పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్నారని , బల్లిపడిన టిఫిన్లు.. చిట్టెలుకలు తిరిగే చట్నీలు విద్యార్థులకు పెడుతున్నారని.. ఈ విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరు..? అని ప్రశ్నించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్నారు.. మొత్తానికి కాంగ్రెసోళ్లు వ‌చ్చారు.. పెద్ద‌మార్పే తెచ్చారు అన్నారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం హాస్ట‌ళ్లలో నెల‌కొన్న దుస్థితిపై కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

ప‌దేండ్ల క్రితం నాటి కాంగ్రెస్ పాల‌న‌లో ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌లో పురుగుల అన్నం, నీళ్ల చారు క‌నిపించేవి. నేటి కాంగ్రెస్ పాల‌న‌లో ప్ర‌భుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. అల్పాహారంలో బ‌ల్లులు, చ‌ట్నీల్లో చిట్టెలుక‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయ‌ని ఆగ్రహం వ్యక్తం చేసారు.

మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతంగా మారింది. నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడడంతో 20 మంది విద్యార్థులు వాంతుల‌తో ఆస్ప‌త్రుల్లో చేరారు. సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ హాస్టల్‌లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలెత్తారు. ఈ విషాహారం తింటే.. విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు…? అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ..? అని కేటీఆర్ నిల‌దీశారు.

కలుషిత ఆహారం వల్ల.. పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆస్ప‌త్రుల‌ పాలవుతున్నారు. అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే.. విద్యార్థులకు ఈ అవస్థ…! ఈ అస్వస్థత…!! ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలి.. లేకపోతే.. భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదం. వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.