ఇందిరమ్మ రాజ్యం అంటూ.. ఎమర్జెన్సీ రోజులు అమలు – కేటీఆర్

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసంలో ఈరోజు పార్టీ సమావేశానికి BRS పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న కౌశిక్ ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

నిన్న బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి వరకు అక్రమ అరెస్టులు చేసి.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తారా? అంటూ ఆయన ధ్వజమెత్తారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా? అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని కేటీఆర్ ప్రశ్నించారు.

. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం దిగజారుడు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం జులుం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నారు.