విద్యార్థుల డిమాండ్లను త‌క్ష‌ణ‌మే నెర‌వేర్చాలిః కేటీఆర్‌

ktr

హైదరాబాద్‌ః టీజీపీఎస్‌సీ వ‌ద్ద‌ ఉద్యోగాల సాధన కోసం డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులపై పోలీసుల ద్వారా అణిచివేత కార్యక్రమాలని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల డిమాండ్లను త‌క్ష‌ణ‌మే నెర‌వేర్చాల‌ని అన్నారు. శాంతియుతంగా నిర‌స‌న తెలియజేయాలనుకున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. నిర్బంధించిన వారిని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల‌కు బీఆర్ఎస్ అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు.

కాగా, ఎన్నికల ముందు ఇదే నిరుద్యోగులతో స్వయంగా తమ పార్టీ నాయకులు రాహుల్ గాంధీతో మూలాఖాత్‌లు ఏర్పాటు చేయించి, అనేక నిరసన కార్యక్రమాలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలోకి రాగానే వారిని అణచివేసే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. కేవలం ఎన్నికలకు ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు నిరుద్యోగులను వాడుకొని ఈరోజు వారు డిమాండ్ చేస్తున్న న్యాయమైన అంశాలపైన కూడా నోరు మెదపడం లేదన్నారు.

ప్రజా పాలన పేరును పదేపదే వల్లే వేసే కాంగ్రెస్ సర్కార్ జమానాలో యువకులకు, విద్యార్థులకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా నియంతృత్వంతో వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్పిన జాబ్ క్యాలెండర్ తేదీల గడువు అయిపోయిందని, వెంటనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు చేస్తున్న అన్ని నిరసన కార్యక్రమాలకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈరోజు అరెస్టు చేసిన విద్యార్థి నాయకులు నిరుద్యోగులు విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.