Kolikapudi Srinivasa Rao : కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం ఉమ్మడి కృష్ణాజిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటారు. ఆయన తీరు గతంలోనే హైకమాండ్ దృష్టికి వెళ్లి పలు హెచ్చరికలు వచ్చినా తన వైఖరిని మార్చుకోలేదని తాజా సంఘటనలు స్పష్టంగా చెబుతున్నాయి.కొన్నిరోజుల క్రితం మరో వివాదంలో కొలికపూడి పేరు మళ్ళీ మారుమోగింది. తిరువూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత అలవాల రమేష్ రెడ్డి పై చర్యలు తీసుకోకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఏకంగా టీడీపీ నాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది.ఇదంతా చర్చనీయాంశంగా మారుతుండగానే నేడు మరింత కీలక పరిణామం చోటుచేసుకుంది.

తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు.మాకు కొలికపూడి వద్దు అంటూ వారు బహిరంగంగా నినాదాలు చేశారు.ఈ హఠాత్పరిణామం టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తక్షణమే స్పందించి,తిరువూరు కార్యకర్తలను సముదాయించేందుకు ముందుకొచ్చారు. అక్కడే పార్టీ నేతలతో సమావేశమై, కార్యకర్తల ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టంగా తెలిపారు. అలాగే, తిరువూరు కార్యకర్తల అభిప్రాయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.ఈ సంఘటనలు చూస్తుంటే, కొలికపూడి వ్యవహారం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారిందని అర్థమవుతోంది. హైకమాండ్ ఈ విషయాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.