వైసీపి లో రాజీనామా పర్వాలు సంచలనంగా మారాయి. ఇప్పటికే ఎంతోమంది పార్టీకి , పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చేయగా..తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం పలు చర్చలకు దారి తీసింది. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో మరికొందరు వైసీపీ నేతలు కూడా రాజీనామా చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది.
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తారని, ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరం అవుతారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు వైసీపీ కార్యకర్తల మధ్య కలకలంగా మారాయి. ఈ ప్రచారంపై కొడాలి నాని స్వయంగా స్పందించారు. తాను వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలనే వార్తలు కూడా అవాస్తవమని తేల్చి చెప్పారు. తనపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని కొడాలి నాని ఫేక్ న్యూస్ గా అభివర్ణించారు. ఇది ఎడిటెడ్ న్యూస్ అని, ప్రజలు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు ప్రజలను తప్పుదోవ పట్టించవచ్చని కొడాలి నాని ఆందోళన వ్యక్తం చేశారు. తాను వైసీపీతో కొనసాగుతానని, ప్రజల సేవకు మద్దతుగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.