నిజాం రాజకార్ల మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నాం – కిషన్ రెడ్డి

హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు 3 కీలక ఘట్టాలు చోటుచేసుకోనున్నాయి. ఓ వైపు గణేశ్ శోభాయాత్ర, వేలాది విగ్రహాల నిమజ్జనం జరగనుంది. మరోవైపు పబ్లిక్ గార్డెన్స్లో జరిగే ప్రజా పాలన దినోత్సవానికి సీఎం రేవంత్, పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే విమోచన దినోత్సవానికి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్, సంజయ్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. దీంతో హైదరాబాద్ అంత భక్తులు , పోలీసులు , రాజకీయ నేతలతో సందడి గా మారింది.

బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆయన.. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనేక బలిదానాలు, అనేక త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్య్రం దక్కిందని, నిజాం రాజకార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పాత్ర సాహసోపేతమైనదని వ్యాఖ్యానించారు. ఆ గొప్ప విజయానికి ప్రతీకగానే మూడేళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీ కి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులోత్తుతూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి. తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలి” అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.