తెలంగాణలో భారీ వర్షాలు.. 5 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పలు చోట్లు వాగులు, కట్టలు తెగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 24 గంటల పాటు కురిసిన కుండపోత వర్షాలకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో వరదలు వచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే మరో అల్ప పీడనం పొంచి ఉంది. రేపటి నుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుంది. దీని కారణంగా తెలంగాణ తో పాటు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి.

ఈరోజు నుంచి తెలంగాణలో ఐదు రోజులు మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్‌ ఐఎండీ అధికారిణి శ్రావణి చెప్పారు. ఖమ్మం, కొమురంభీం, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. ఈ తరుణంలోవిద్యార్థులు విద్యాంసంస్థలకు వెళ్లే అవకాశం లేకపోవటంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఐదు రోజుల పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సెలవులు మంజూరు చేయటం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 6 (శుక్రవారము) వరకు సెలవులు ప్రకటించినట్లు చెప్పారు. ఇక సెప్టెంబర్ 7న వినాయక చవితి, సెప్టెంబర్ 8న ఆదివారం కావటంతో విద్యా సంస్థలు సెప్టెంబర్ 9న తెరుచుకుంటాయని చెప్పారు.