ప్రశాంతంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభం

ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. తెల్లవారుజామునే తుది పూజలు నిర్వహించిన నిర్వాహకులు క్రేన్ సహాయంతో వినాయకుడిని భారీ టస్కర్పైకి ఎక్కించారు. భక్తుల నినాదాలు, సందడి మధ్య ఊరేగింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు NTR మార్గాని క్రేన్ నంబర్-4 దగ్గరికి గణనాథుడు చేరుకోనున్నాడు. అనంతరం నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి రికార్డు స్థాయిలో 70 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. సప్తముఖ మహాశక్తి గణపతి గా భక్తులకు దర్శనం ఇచ్చారు. శిల్పి చిన్న స్వామి రాజేందర్‌ ఆధ్వర్యంలో లంబోధరుడుని రూపొందించారు. 200 మంది కార్మికులు ఒకటిన్నర రోజులు శ్రమించి గణేషుడిని అలంకరించారు. 11 రోజులపాటు మహాగణపతిని లక్షలాది మంది భక్తులు, సందర్శకులు దర్శించుకున్నారు. ఈసారి రూ.కోటి 10 లక్షల ఆదాయం సమకూరిందని నిర్వాహకులు వెల్లడించారు. హుండీ ద్వారా రూ.70 లక్షలు రాగా, ప్రకటనలు, హోర్డింగుల ద్వారా మరో రూ.40 లక్షలు సమకూరాయి.