ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపాంతరం కారణంగా డేటా సైంటిస్టులు, ఏఐ ట్రైనర్లు, ఎథికల్ ఏఐ స్పెషలిస్టులకు డిమాండ్ పెరుగుతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దావోస్‌లోని ఆల్పెన్ గోల్డ్ హోటల్‌లో జరిగిన “గ్లోబల్ ఎకానమీస్ & లేబర్ మార్కెట్లపై ఏఐ ప్రభావం” అనే రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వరల్డ్ ఎకనమిక్ ఫోరం వైట్ షీల్డ్ ఆర్థిక విభాగం మాజీ చీఫ్ జెన్నిఫర్ బ్లాంకే మరియు గూగుల్ గవర్నమెంట్ ఎఫైర్స్ డైరెక్టర్ సెలిమ్ ఎడే సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
సమావేశంలో మంత్రి లోకేశ్ ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. “మ్యానుఫ్యాక్చరింగ్, కస్టమర్ సర్వీస్, డేటా ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 25-30% టాస్కులు ఆటోమేషన్ అవుతాయి. దీని ప్రభావం ఆయా రంగాల్లోని ఉద్యోగులపై పడుతుంది. ఈ మార్పులను ఎదుర్కొనడానికి రీ-స్కిల్లింగ్ అవసరం. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు కలిసి పనిచేయడం చాలా ముఖ్యం. భారతదేశంలో జాతీయ ఏఐ పోర్టల్ ద్వారా సంబంధిత వనరులు అందుబాటులో ఉన్నాయి. వ్యక్తులు, సంస్థలు ఏఐ రంగంలో అవకాశాలను అన్వేషించడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
డిజిటల్ ఇండియా మిషన్ నిర్వహిస్తున్న అక్షరాస్యత కార్యక్రమాలు భవిష్యత్ ఏఐ శిక్షణకు బలమైన పునాదిగా ఉంటాయి” అని ఆయన అన్నారు.“ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ సహా ప్రముఖ సంస్థలతో కలిసి ఏఐ విద్యాభివృద్ధి కోసం పని చేస్తున్నాం. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో తొలి ఏఐ స్కిల్స్ ల్యాబ్ ప్రారంభించాం. ఇక్కడ ఏడో తరగతి నుండి పదో తరగతి వరకు 500 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.‘ఏఐ ఫర్ ఆల్’ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు కూడా శిక్షణ అందించాం. భవిష్యత్ తరం నిపుణుల కోసం త్వరలో ఒక ఏఐ విశ్వవిద్యాలయం స్థాపించబోతున్నాం. ఈ విశ్వవిద్యాలయం పరిశోధకులు, అభ్యాసకులకు ఆధునిక శిక్షణ అందిస్తుంది” అని మంత్రి లోకేశ్ వెల్లడించారు.