తెలంగాణ డీఎస్సీ పరీక్షలపై విద్యాశాఖ కీలక అప్‌డేట్‌

Key decision of Education Department on Telangana DSC Exams

హైదరాబాద్‌ః తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్‌.. డీఎస్సీ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని, షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షలు ఎట్టిపరిస్థితిలోనూ వాయిదా వేసేది లేదని తేల్చిచెప్పింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18వ తేది నుంచి ఆగస్టు 5వ తేది వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.

ఈ పరీక్షలకు సంబంధించి ఇటీవల సబ్జెక్టులు, పోస్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ముందుగా ప్రకటించిన తేదీల్లోనే డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఉంటుందని, ఎటువంటి మార్పులు ఉండబోవని విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే ఇటీవలే టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో టెట్‌, డీఎస్సీ సిలబస్‌లో మార్పులు ఉండడంతో చదివేందుకు సమయం సరిపోవడం లేదని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారంతా సోమవారం ఉదయం లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలోనే పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఇదే..

రాష్ట్రంలోని మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదలయ్యిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 2.79 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. జులై 18 వ తేది నుంచి మొత్తం 13 రోజులపాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

.జులై 18వ తేదిన మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్

.జులై 19వ తేదిన సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష

.జులై 20వ తేదిన ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి.

.జులై 22వ తేదిన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్

.జులై 23వ తేదిన సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష

.జులై 24వ తేదిన స్కూల్ అసిస్టెంట్ – బయలాజికల్ సైన్స్

.జులై 25వ తేదిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, మరాఠీ

.జులై 26వ తేదిన తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్

.జులై 30వ తేదిన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్

.ఆగస్టు 5 వరకు మిగతా పరీక్షలు జరగనున్నాయి.