వాయనాడ్ లో 125కి చేరిన మృతుల సంఖ్య

కేరళలో కుండపోత వర్షాల కారణంగా పెను విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వయనాడ్ సమీపంలోని మెప్పాడిలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 125 మంది మరణించారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్తో మాట్లాడి అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు మోదీ ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సానుభూతి తెలియజేశారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలను ట్విట్టర్ వేదికగా ఆదేశించారు. ఇక నాలుగు గంటల వ్యవధిలోనే 3 సార్లు కొండచరియలు విరిగి పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

కేరళలో కొద్దిరోజులుగా ఏకధాటిగా అతి భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేెకించి- కేరళ ఉత్తరప్రాంతంలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటోంది. చెరువులు, కుంటలు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల తాకిడికి వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాలోని మెప్పాడి, ముండక్కై టౌన్, చూరల్‌మాలా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగి జనావాసాల మీద పడ్డాయి. అదే సమయంలో బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది. అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు తొలి దుర్ఘటన సంభవించింది. ముండక్కై టౌన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. తెల్లవారు జామున 4 గంటల సమయంలో చూరల్‌మాలాలో రెండో ప్రమాదం చోటు చేసుకుంది.

కాగా, వాయనాడ్ లో పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షిస్తున్నారని కేంద్ర సహాయమంత్రి జార్జ్ కురియన్ వెల్లడించారు. వాయనాడ్ లో కొనసాగుతున్న సహాయక చర్యలను మోదీ పర్యవేక్షిస్తున్నారని ,ఈ కష్టకాలంలో కేరళ ప్రజలకు అన్ని రకాల సహకారం అందించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని జార్జ్ కురియన్ స్పష్టం చేశారు. కాగా, వాయనాడ్ లో జరుగుతున్న సహాయక చర్యల బాధ్యతలను కేంద్రం జార్జ్ కురియన్ కు అప్పగించింది. గల్లంతైన వారి కోసం రెండు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు, రెండు ఆర్మీ బృందాలు, రెండు వాయుసేన హెలికాప్టర్లను రంగంలోకి దించామని కురియన్ చెప్పారు. సహాయక చర్యలు, గాలింపు చర్యల కోసం మరిన్ని బలగాలను రప్పిస్తున్నామని చెప్పారు.