ఏపీకి రానున్న కేరళ ఐఏఎస్‌ కృష్ణతేజ

కేరళ ఐఏఎస్‌ అధికారి మైలవరపు కృష్ణతేజ ఏపీకి డిప్యుటేషన్‌పై రానున్నారు. ఐఏఎస్ కృష్ణ తేజను డిప్యూటేశన్ పై ఆంధ్రప్రదేశ్‌కు పంపడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేరళ నుంచి ఏపీకి మూడేళ్లపాటు డిప్యుటేషన్‌కు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కృష్ణ తేజ కేరళలోని త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

కృష్ణతేజ కేరళలో సమర్థుడైన ఐఏఎస్ అధికారిగా పేరుతెచ్చుకున్నారు. విధి నిర్వహణలో ఆయన కృషికి గుర్తింపుగా 2 అంతర్జాతీయ పురస్కారాలు, 7 జాతీయ అవార్డులు వరించాయి. కాగా, డిప్యుటేషన్ పై ఏపీకి వస్తున్న కృష్ణతేజ… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించే మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తారని తెలుస్తోంది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఐఏఎస్ కృష్ణతేజను ఎన్నో సందర్భాల్లో అభినందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన్ను ఓఎస్డీగా ఏపీకి తీసుకురావాలని భావించారు.. మంత్రులకు ఓఎస్డీలుగా సాధారణంగా ఆర్డీవో స్థాయి అధికారులను నియమిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కోసంఐఏఎస్‌ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి సంబంధించి డిప్యుటేషన్‌పై ఏపీకి పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరోవైపు 2013 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి సీహెచ్‌.హరికృష్ణారెడ్డి కేంద్ర జలసంఘం డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన్ను రెవెన్యూశాఖ నుంచి డిప్యుటేషన్‌ మీద జలశక్తి శాఖకు పంపుతూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.