వాయనాడ్‌ ఘటన..సీఎండీఆర్‌ఎఫ్‌కు కేరళ సీఎం విరాళం

kerala-chief-minister-pinarayi-vijayan-donates-rs-1-lakh-and-his-wife-t-o-kamala-contributes-rs-33000-to-cmdrf

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి స‌మీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ‌చ‌రియ‌లు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 358కి పెరిగింది.

ఇక ఈ ఘటనలో బాధితులను ఆదుకునేందుకు పలువురు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీతారలు కేరళ సీఎం డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ కు తమ వంతు సాయం అందించారు. తాజాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు రూ.1లక్ష విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన భార్య టి.కె.కమల సైతం రూ.33 వేలు విరాళంగా ప్రకటించినట్లు కేరళ సీఎంవో శనివారం తెలిపింది.

మరోవైపు సీఎండీఆర్‌ఎఫ్‌కు ఇప్పటికే పలువురు సినీ తారలు విరాళం అందించిన విషయం తెలిసిందే. నయనతార – విఘ్నేశ్‌ దంపుతులు రూ.20 లక్షలు, విక్రమ్​ రూ.20 లక్షలు, హీరో సూర్య ఫ్యామిలీ జ్యోతిక, హీరో కార్తి కలిసి సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.50 లక్షలను అందించారు. అదేవిధంగా మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కలిసి రూ.35 లక్షలు, మోహన్‌లాల్‌ రూ.25లక్షలు, ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు, రష్మిక ర.10 లక్షలు విరాళంగా అందించారు.