కేజ్రీవాల్ బ్లడ్‌ షుగర్‌ భారీగా పడిపోతున్నది: ఆప్‌

Kejriwal’s blood sugar drops drastically: AAP

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై తీహార్‌ జైలు అధికారులు చేస్తున్న ప్రకటనలను ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్ తప్పుపట్టారు. కేజ్రవాల్‌ ఆరోగ్యం బాగానే ఉందని, కీలక అవయవాలు సజావుగా పనిచేస్తున్నాయని జైలు అధికారులు చెబుతున్నారు. అయితే ఢిల్లీ సీఎం 8.5 కిలోల బరువు తగ్గారని, ఆయన బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ పడిపోయాయని సంజయ్ సింగ్‌ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ ఆరోగ్య పరిస్ధితిపై జైలు అధికారులు విడుదల చేసిన వైద్య నివేదికలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎయిమ్స్‌ వైద్యుల బృందం కేజ్రీవాల్‌ ఆరోగ్య పరిస్ధితిని పరీక్షిస్తోందని, కేజ్రీవాల్‌ త్వరగా బరువు కోల్పోతున్నారని, లో షుగర్‌తో బాధపడుతున్నారని వైద్యులు గుర్తించారని చెప్పారు. కేజ్రీవాల్ బ్లడ్‌ షుగర్‌ భారీగా పడిపోతున్నదని ఫలితంగా ఆయన కోమాలోకి వెళ్లవచ్చని, లేదా మరణించే ప్రమాదం పొంచిఉందని సంజయ్ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ మరణానికి కుట్ర పన్నుతున్నారని, అరెస్టయిన రోజున కేజ్రీవాల్‌ బరువు 70 కిలోలు కాగా, ఆయన బరువు ఇప్పుడు 61.5 కిలోలకు తగ్గిందని చెప్పారు.

కేజ్రీవాల్‌ జీవితంతో చెలగాటం ఆడవద్దని తాను ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. కేజ్రీవాల్‌కు జరగరానిది ఏమైనా జరిగితే కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పేందుకు తడుముకునే పరిస్ధితి తలెత్తుతుందని ఆయన హెచ్చరించారు. కాగా, ఎక్సైజ్‌ పాలసీ కేసులో తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున ప్రచారం చేసుకునేందుకు సుప్రీంకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో జూన్‌ 2న జైలు అధికారుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలసిందే.