కేజ్రీవాల్ కస్టడీ ఆగస్టు 8 వరకు పొడిగింపు

Kejriwal custody extended till August 8

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కి సంబంధించిన సీబీఐ కేసులో.. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని మరోసారి పొడిగించారు. కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని మరో రెండు వారాలు.. అంటే ఆగస్టు 8 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ నెల 12న పొడిగించిన రెండు వారాల జ్యుడీషియల్‌ కస్టడీ కూడా ఈరోజు తో ముగియడంతో.. సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చారు.

కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఆయన కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని అధికారులు కోర్టును కోరారు. దాంతో కోర్టు కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని మరో రెండు వారాలు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్‌ 26న సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. దాంతో కోర్టు ముందుగా మూడు రోజుల సీబీఐ రిమాండ్‌ విధించింది.

ఆ తర్వాత జూన్‌ 29న రెండు వారాల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. ఆ తర్వాత వరుసగా రిమాండ్‌ను పొడిగిస్తూ వస్తున్నారు. కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 19న కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి ఆయనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో తీహార్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను అదే కేసులో సీబీఐ అరెస్ట్‌ చేసింది.