చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శం: కేసీఆర్‌

kcr-pays-floral-tribute-to-chakali-ilamma

హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి (సెప్టెంబర్ 10) సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మహిళా శక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో వారి పోరాట స్ఫూర్తి ఇమిడివున్నది.

ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కార స్వరాన్ని వినిపించిన వీరనారి చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శమని కేసీఆర్ కొనియాడారు. ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించే దిశగా వారి జయంతిని తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చాకలిఐలమ్మ వర్దంతిని ఘనంగా నిర్వహించగా.. ప్రస్తుతం ఆయన అధికారం కోల్పోవడంతో ఆమె సేవలను స్మరించుకున్నారు. ఇదిలాఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కేసీఆర్ బయటకు వస్తారని, తెలంగాణ ప్రజలకు మరోసారి చేరువ అవుతారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.