కల్తీసారా ఘటనలో 63కు పెరిగిన మృతులు సంఖ్య

తమిళనాడు కల్తీ సారా తాగి ఆసుపత్రి పాలైన ఘటన లో మృతుల సంఖ్య 63 కు చేరింది. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో గత వారం కల్తీ సారా తాగిన తర్వాత వాంతులు, విరోచనాలు , కడుపులో మంట ఇలా అనేక కారణాలతో ఇబ్బందులు పడడంతో వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ , ప్రవైట్ హాస్పటల్స్ కు తరలించారు. ఇంకా చికిత్స పొందుతూ మరణిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 63 మంది మరణించగా..ఇంకా చాలామంది పరిస్థితి విషయంగా ఉంది. ఇంకా సుమారు 115 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీసారా ఘటనపై ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) నేతలు ఆందోళనకు దిగారు. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నాడీఎంకే నేతలు, సభ్యులు చెన్నైలో గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఘటనపై సీబీఐ చేత విచారణ (CBI inquiry) జరిపించాలని డిమాండ్‌ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

కల్తీ మద్యం ఘటనపై ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో సస్పెన్షన్‌ వేటు పడింది. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేల‌పై స‌స్పెన్షన్ విధించారు. బుధవారం సభలో ప్రశ్నోత్తరాల‌ను వాయిదా వేసి క‌ళ్లకురిచిలో క‌ల్తీ మ‌ద్యం తాగి మ‌ర‌ణాలు న‌మోదు అయిన ఘ‌ట‌న‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం స్టాలిన్‌ రాజీనామా చేయాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతో ప్రతిప‌క్ష నేత ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామితో పాటు ఇత‌ర అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌పై వేటు వేశారు.