తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. గతేడాది బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో ఆయన ఒకరు. కడియం శ్రీహరి మాట్లాడుతూ, “ఉపఎన్నికలు వస్తే నేను పారిపోను, పోరాటంలో కొనసాగుతాను” అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వేసిన పిటిషన్లపై తీర్పు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, తాను కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తానని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి గత వారం అనర్హత పిటిషన్లపై 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పి. కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఫిబ్రవరి 10న తదుపరి విచారణ జరగనుంది. బీఆర్‌ఎస్ అధికారం ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిందని శ్రీహరి ఆరోపించారు. “తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని” ఆయన విమర్శించారు. దళితులకు 18% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సమర్థిస్తున్నారని ఆరోపించారు.
1980ల్లో టీడీపీ నుంచి కడియం శ్రీహరి రాజకీయ ప్రయాణం ప్రారంభం అయింది. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో మంత్రి గ పనిచేసారు. 2013లో టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్)లో చేరారు. 2014లో వరంగల్ లోక్‌సభకు ఎంపిక అయ్యారు, 2015లో తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. 2023లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది మార్చిలో కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం, బీఆర్‌ఎస్ ఫిరాయింపుదారులపై కేసు విచారణలో ఉండగా, “న్యాయ పోరాటానికి సిద్ధం” అని శ్రీహరి స్పష్టం చేశారు.